Principal Message

రామదాసు శ్రీరామభక్తుడు, భక్తిరస రచనలు చేసిన తెలుగు వాగ్గేయకారుడు. రామదాసు సంకీర్తనలు మన సంస్కృతీ సంప్రదాయాలకు ఆనవాలేగాక తెలుగునాట భజన సంప్రదాయానికి నిలువెత్తు సాక్ష్యాలు. అలాంటి పరమ భాగవతోత్తముడు, వాగ్గేయకారుడు అయిన శ్రీరామదాసు పేరు మీద ఒక సంగీత కళాశాల ఆవిర్భవించడం ఎంతో సంతోషించదగ్గ విషయం.

1957వ సంవత్సరం మార్చి 12వ తేదీన సికింద్రబాద్ నందు "శ్రీ భక్తరామదాసు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల" ను రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక శాఖ వారు స్థాపించారు. నాటి నుండి నేటి వరకు ఈ కళాశాల దినదినాభివృద్ధి చెందుతూ సంగీత కళామతల్లికి సేవలందిస్తూ సంగీత ప్రపంచంలో గొప్పగా విరాజిల్లుతూవుంది.

శ్రీ భక్తరామదాసు సంగీత నృత్య కళాశాలలో ఎందరో ఉద్దండులైన విద్వాంసులు ప్రధాన ఆచార్యులుగాను, అధ్యాపకులుగాను విధులు నిర్వహించారు. మహామహోపాధ్యాయ పద్మభూషణ్ శ్రీ నూకల చిన సత్యనారాయణ, సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి, గానకోకిల శ్రీరంగం గోపాలరత్నం మొదలైన వారు ముఖ్యులు.

కళాశాలలో గాత్రం, వీణ, వైలన్, మృదంగం మొదలైన కర్నాటక సంగీత విభాగాలు, పేరిణి, కూచిపూడి వంటి నాట్య విభాగాలు, హిందుస్తానీ గాత్రం, సితార్, తబల వంటి హిందుస్తానీ సంగీత విభాగాలు వున్నాయి. అన్ని విభాగాల్లోను అనుభవజ్ఞులైన అధ్యాపకులు తమ తమ విద్యార్ధులను తీర్చి దిద్దుతూ, ప్రపంచం నలువైపుల కచేరీలు చేస్తూ భారతీయ సంగీత ఔన్నత్యాన్ని చాటుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం, సాంస్కృతిక శాఖ సామాన్యులకు సైతం సంగీతం చేరువు అవ్వాలనే సదుద్దేశంతో అతి తక్కువ రుసుంతో కళాశాలలో విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తూవుంది. ఈ అవకాశాన్ని విద్యార్థులు, కళాప్రియులు సద్వినియోగం చేసుకోవడం గొప్ప విశేషం.

విద్యార్థులను ప్రోత్సహిస్తూ కళాశాలలో అనేక సంగీత కార్యక్రమాలు నిర్వహించ బడుతూవుంటాయి. ఆ కార్యక్రమాల్లో విద్యార్థులేగాక, కళాభిమానులు కూడ పెద్ద సంఖ్యలో పాల్గొంటూవుంటారు. ఇలాంటి కార్యక్రమాలు వల్ల, విద్యార్థుల్లో మానసిక వికాసంతో పాటు సమాజంలో మంచి సాంస్కృతిక వాతావరణం ఏర్పడ్డానికి అవకాశం వుంటుంది.

విద్యార్థులను, కళాభిమానులను, కళాకారులను ప్రోత్సహిస్తూ మా కళాశాల నిరంతరం కృషి చేస్తూ వుంటుంది. అలాంటి ఉన్నత ప్రమాణాలు కలిగిన కళాశాలలో నేను ప్రధాన ఆచార్యులుగా విధులు నిర్వహించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూన్నాను. మా ఈ కళాశాల దినదినాభివృద్ధి చెందుతూ సంగీత కళారంగంలో భారతదేశంలోనే మహోన్నత స్థాయిలో నిలవాలని హృదయపూర్వకంగా ఆశిస్తూ.... అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను.